Site icon TeluguMirchi.com

రహదారుల అభివృద్ధి జరిగితేనే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యం

cbn-teleconference
రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించాలంటే రహదారుల అభివృద్ధి పక్కాగా జరగాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమీక్షలో మాట్లాడారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక అభివృధ్ది జరగాలంటే రోడ్డు, రైల్, వాటర్ వేస్, ఎయిర్ వేస్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడాల్సి వుందన్నారు. 20 ఏళ్ల క్రితమే తాను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రహదారులను అద్దంలా తీర్చిదిద్దానంటూ, తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. సుబ్బరామిరెడ్డిని క్వాలిటి కంట్రోల్ అధికారిగా నియమించి నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం గుర్తుచేశారు.

5 నెలల 15 రోజుల్లో పట్టిసీమ పూర్తి, హుద్‌హుద్ తుఫాన్ సహాయ చర్యలు, గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించిన స్పూర్తిని ఏడాది పొడవునా అన్ని ప్రభుత్వ శాఖలు చూపితే రాష్ట్రం స్వల్ప కాలంలోనే రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందన్నారు. అన్ని జాతీయ రహదారులు రాజధాని అవుటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం కావాలన్నారు. హైదరాబాద్ కు నాలుగు రహదారుల కనెక్టివిటీ ఉండాలని, వాటిని ప్రధాన ఓడరేవులతో అనుసంధానించాలని చెప్పారు.

భీమునిపట్నం నుంచి ఒంగోలు మధ్య అభివృద్ది చేసే బీచ్ రోడ్డు (ఎన్ హెచ్ – 216) దేశంలోనే అద్భుతమైన రహదారిగా రూపొందించాలనేది తన ఆకాంక్షగా పెర్కోన్నారు. కాలిఫోర్నియాలోని ఫసిఫిక్ కోస్ట్ హైవే స్థాయిలో బీచ్ రోడ్డు ఉండాలంటూ అవసరమైతే అధికారులు కాలిఫోర్నియా సందర్శించి అధ్యయనం చేయాలని సూచించారు.

కడప నుంచి రాజధానికి, పోర్టుకు నేరుగా రహదారిని అభివృద్ధి చేయాలన్నారు. విశాఖపట్నం, బావనపాడు, కృష్ణపట్నం, మచిలీపట్నం, వాన్ పిక్ పోర్టులను అనుసంధానిస్తూ రహదారులను అభివృద్ధిచేయాలన్నారు. పోర్టులు, రాజధానితో రాష్ట్రంలోని అన్ని రహదారులను కలిపితే ఎగుమతి, దిగుమతులు మరింతగా పెరుగుతాయన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఏజన్సీ ప్రాంతాలమీదుగా మరో ప్రధాన రహదారిని అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. హిందూపూర్ బైపాస్ రోడ్డు అభివృద్ధితో పాటు బెంగుళూరును కలుపుతూ 4లేన్ రహదారిని నిర్మించాలన్నారు. హైదరాబాద్ – కల్వకుర్తి – తిరుపతిని అనుసంధానిస్తే చెన్తైకి దగ్గర దారి అవుతుందన్నారు. కడప – రాజంపేట- కోడూరు- తిరుపతిని కలుపుతూ రహదారిని అభివృద్ధి చేయాల్సివుందన్నారు. ఇతర ప్రత్యామ్నాయాలను కూడా అన్వేషించాలన్నారు.

రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని బీటి రోడ్డుతో కలపాలని, గ్రామం లోపల సీసీ రోడ్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. రహదారుల నిర్మాణంలో అనుసరించే టెక్నాలజీ అభివృద్ధికి రీసెర్చ్ వింగ్ వుండాలని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు. మెరుగైన సాంకేతికత, మేలైన విధానాల అన్వేషణపై నిరంతరం అధ్యయనం జరగాల్సివుందన్నారు. వర్షాకాలంలో కూడా గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గొప్ప లాజిస్టిక్ హబ్‌గా పేరొందాలని ఆకాంక్షించారు. ఏ రోడ్డుపైనా గుంతలు కనిపించకూడదని, బెర్మ్స్ పటిష్టం చేయాలని, ఎప్పటికప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేస్తూ గతానికి, ప్రస్తుతానికి తేడా వచ్చిందనే అభిప్రాయం ప్రజలలో కనిపించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజల ఫిర్యాదులపై మరింత బాధ్యతగా మెలగాలన్నారు. త్వరితగతిన స్పందించి మరమ్మత్తులు జరపాలన్నారు. నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలా ఆర్ అండ్ బీ శాఖ ప్రగతిపై సమీక్షిస్తానన్నారు. ఈ సమీక్షలో మంత్రి శిద్ధా రాఘవరావు, ముఖ్యకార్యదర్శి శ్యాంబాబు, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజమౌళి, ఇతర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్.ఈలు పాల్గొన్నారు.

Exit mobile version