బోఫోర్స్ పాత్రధారి ఖత్రోకీ మృతి

ottavio_quattrocchiబోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఇటాలియన్ ఆయుధ దళారి ఒట్టావియో ఖత్రోకీ (74) ఇటలీలోని మిలాన్ నగరంలో గుండెపోటుతో మరణించాడు. దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణంపై సీబీఐ 1999లో కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఖత్రోకీపై అభియోగాలు మోపింది. స్వీడన్‌కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు 1986లో కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో సిబిఐ 1999లో ఆయనపై ప్రధాన అభియోగ పత్రం నమోదు చేసింది. ఆయనను మనదేశానికి తీసుకురావడానికి సిబిఐ అధికారులు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా దర్యాప్తు చేసినా ఖత్రోకీకి వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ దొరకలేదంటూ 2009లో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు 2011 మే 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఖత్రోకీపై అభియోగాలను రద్దు చేసింది. దీంతో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే బోఫోర్స్ కేసు ముగిసిపోయింది.