దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశంలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని మళ్లీ పుంజుకున్న సందర్బాలు ఉన్నాయి. అయితే అప్పుడు నాయకత్వం బలంగా ఉండటంతో పాటు, దేశ ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం ఏర్పడేలా చేయగలిగారు. కాని ప్రస్తుత పరిస్థితి అలా లేదు. మళ్లీ దేశంలో పార్టీని నిలబెట్టే నాయకత్వం లోపించింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కలిగించగల సత్తా ఉన్న అధినేత కరువయ్యారు.
సోనియా గాంధీ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడం దాదాపు అసాధ్యం. రాహుల్ గాంధీకి పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొందరు భావిస్తున్నారు. కాని రాహుల్ గాంధీకి బీజేపీతో ఢీ కొట్టగల సత్తా లేదని ఇప్పటికే పలు సందర్బాల్లో వెళ్లడైంది. ఇక కాంగ్రెస్‌లో మిగిలింది, అందరి ఆశా కిరణం ప్రియాంక గాంధీ. ఇందిరా గాంధీ పోలికలతో ఉండే ప్రియాంక గాంధీ మళ్లీ దేశంలో కాంగ్రెస్‌కు పునరుత్తేజం తీసుకు రాగలరని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీతో బాహాటంగా అనే సాహసం ఎవరు చేయడం లేదు. అంతా కూడా లోలోన ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయాలని కోరుకుంటున్నారు.
ఆ విషయమై సోనియా గాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలకు సంవత్సరం ముందే ప్రియాంక గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించి, ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించి ఎన్నికల్లోకి వెళ్లాలనే అభిప్రాయం సోనియా గాంధీలో కూడా ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా అందుతుంది. ఇదే కనుక నిజం అయితే 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం.