ఇక రాష్ట్రపతి పాలన!

President-rule-in-APరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈరోజు ప్రధాని నివాసంలో జరిగే కేంద్ర కేబినేట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేయనున్నారు. మంత్రివర్గ నిర్ణయానికి రాష్ట్రపతి పచ్చజెండా పూపిన వెంటనే.. రాష్ట్రంలో గవర్నర్ పాలన ప్రారంభమవుతుంది. అతి త్వరలో ఎన్నిక షెడ్యూల్ రానున్న నేపథ్యంలో.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పెద్దగా ఉపయోగం లేదని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ పెద్దలు విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి షిండే తో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ నిన్న సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి పాలనపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన కొత్తేమీ కాదు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. జై ఆంధ్రా ఉద్యమం కారణంగా శాంతి భద్రలు అదుపు తప్పిన నేపథ్యంలో.. రాష్ట్రపతి పాలన విధించారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 122సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. ఇందులో అత్యధికంగా మణిపూర్ లో 10, యూపీ-9, పంజాబ్-8, బీహార్-8, కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరిల్లో 6సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.