మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరపున సినిమా పరిశ్రమ నుండి ప్రచారం చేసిన వారు ప్రముఖంగా అలీ, పృథ్వీ మరియు పోసాని. ఈ ముగ్గురు ప్రముఖ పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అలీ మరియు పృథ్వీలు ప్రభుత్వం నుండి నామినేటెడ్ పదవులు పొందారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ ఏపీకి జగన్ సీఎం అవ్వడం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఎవరికి ఇష్టం లేనట్లుందని, అందుకే ఇప్పటి వరకు జగన్‌ను ఎవరు కూడా కలిసి అభినందించలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పృథ్వీ రెండు మూడు సార్లు ఇదే వ్యాఖ్యలను చేయడంతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పృథ్వీ వ్యాఖ్యలపై పోసాని మండి పడ్డాడు. ఇండస్ట్రీ వారికి జగన్ సీఎం అవ్వడం ఇష్టం లేదనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. జగన్ సీఎం అయినప్పటి నుండి చాలా బిజీగా ఉన్నాడు. అందువల్ల ఆయన్ను కలిసే అవకాశం ఇండస్ట్రీ వారికి రాలేదు. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఇప్పుడు జగన్ సినిమా పరిశ్రమ వారికి సమయం ఇస్తాడని తాను భావిస్తున్నాను. త్వరలోనే ఇండ్రస్టీ నుండి పెద్దలు వెళ్లి సీఎం జగన్‌ను కలుస్తారని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ వారికి జగన్‌పై ఏం కోపం లేదని కూడా పోసాని అన్నాడు.