Site icon TeluguMirchi.com

సామాన్యులకి గాంధీ..ప్రజాప్రతినిధులకు అపోలోనా..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలే కాక ప్రజా ప్రతినిధులు సైతం దీనిబారిన పడుతున్నారు. అయితే సామాన్య ప్రజలకు గాంధీ లో చికిత్స తీసుకుంటుంటే..ప్రజాప్రతినిధులు మాత్రం కార్పొరేట్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు.

కరోనా నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. వెయ్యి కోట్లు అయినా సరే కరోనాను ఎదుర్కొందామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా జరగడం లేదన్న అయన హైదరాబాద్ లో తప్ప జిల్లా కేంద్రాల్లో టెస్టులు పెద్దగా చేయడం లేదని అన్నారు. కరోనా నిబంధనలు కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలకేనా ..అధికార పార్టీ నేతలకు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా విలయతాండవం సృష్టిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేపట్టడం, రాజకీయ సమావేశాలు నిర్వహించడం అవసరమా? అని పొన్నం ప్రశ్నించారు.

హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని, కచ్చితంగా లాక్ డౌన్ విధించాలని ఆయన అన్నారు. కరోనా వస్తే ఎంతటివారైనా సరే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అన్న ప్రభుత్వం, మరి ప్రజాప్రతినిధులను ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ అవుతుంటే మాట్లాడడం లేదని అన్నారు. సామాన్య ప్రజలకు కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలో ప్రజాప్రతినిధులకు వస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స ఎందుకు ? అని ప్రశ్నించారు.

Exit mobile version