పెట్టుబడులకు అత్యుత్తమ నగరం.. ’భాగ్యనగరం’ : పొన్నాల

ponnalaపెట్టుబడులకు హైదరాబాద్ దేశంలోనే రెండో అత్యుత్తమ నగరంగా గుర్తింపు పొందిందని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అత్యధికులకు ఉపాథి కల్పిస్తున్న హైదరాబాద్ నగరానికి మౌలిక వసతుల రంగంలో చేయూతనిచ్చేందుకు
ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 13, 14న జరగనున్న క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆప్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్) 2013 కాన్ క్లేవ్ బ్రోచర్ ను పొన్నాల ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోచారంలో నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఇన్ఫోసిస్ క్యాంపస్ ద్వారా దాదాపు 45 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు.

రాబోయే కాలంలో నగరంలో ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుపడే అవకాశం వుందని పొన్నాల ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిభట్లలో నిర్మాణంలో ఉన్న టీసీఎస్ 25 వేల మందికి, వచ్చే రెండేళ్లలో విప్రో మరో 12 వేల మందికి కొత్తగా ఉపాధి
కల్పించనున్నాయని ఆయన తెలిపారు. కాగా, దేశంలో పట్టణ జనాభా 2030 నాటికి 590 మిలియన్లకు చేరుకుంటుందని, ఇందుకు మౌలిక వసతుల కల్పనకు 72 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని మంత్రి తెలియజేశారు.