విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి CM వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ”దేశవ్యాప్తంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అన్నారు.
గుంటూరు జిల్లాలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని పోలీస్ పెరెడ్ గ్రౌండ్స్ వద్దగల అమరవీరుల స్ధూపానికి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, అర్బన్ ఎస్.పి ఆరిఫ్ హఫీజ్, రూరల్ ఎస్.పి విశాల్ గున్నిలు పూలమాలలు వేసి, శ్రధ్దాంజలి ఘటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 1959 వ సంవత్సరం లఢాక్ లో మరణించిన పోలీసుల స్మృత్యర్ధం మొదలైన ఈ కార్యక్రమంలో పోలీసులను స్మరించుకోవటం ఎంతో అవసరమని అన్నారు.