ప్రధాని మోడీ, జగన్ భేటీ లో చర్చకు వచ్చిన అంశాలు ఇవే …


ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ లో పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న జగన్ కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఇవే. విభజన చట్టంలోని కీలక అంశాల్లో కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు, పరిష్కరించాల్సిన సమస్యలను సీఎం జగన్ ప్రధాని మోదీకి వినతిపత్రం అందించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకం
– రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి.

పోలవరం పెండింగ్ నిధుల విడుదల
– పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సి ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశంకూడా ఇంకా పెండింగులోనే ఉంది. మొత్తం ప్రాజెక్టుకోసం రూ.55,548 కోట్ల రూపాయలు అవుతుందని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించింది. ఈ ప్రాజెక్టులో డ్రింకింగ్‌ వాటర్‌ సఫ్లైని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తి. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా డ్రింకింగ్‌ వాటర్‌ను ప్రాజెక్టులో భాగంగానే చూశారు.

– పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూస్తున్నారని, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడమే కాకుండా, వ్యయం కూడా పెరుగుతుందని ప్రధానికి వివరించిన సీఎం. ప్రాజెక్టు నిర్మాణ వ్యవయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని విజ్ఞప్తి.

– పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రాధాన్యతా క్రమంలో పనులు చేస్తున్నాం. ఇందులో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం జరగాలంటే ఆయా ముంపు ప్రాంతాల్లో ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంది. ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని, ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేసినట్టైతే పనులు వేగంగా పూర్తి చేయగలము. ఈ నిధులను మంజూరు చేసినట్టైతే భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు సకాలంలో పూర్తిచేయగలము.

రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయులు
– 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలి.

–గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోంది. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయి. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి.

తెలంగాణ డిస్కంల బకాయిలు
– తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ జెన్‌కోకు ఈ బకాయిలు ఎంతో ఊరట కలిగిస్తాయి.

– జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవు దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేసిన అంశాలతో నీతి ఆయోగ్‌ కూడా ఏకీభవించి కేంద్ర ప్రభుత్వానికి ఆహార భద్రత చట్టంలో అవసరమైన మార్పులను సిఫారసు చేసింది. ప్రస్తుత ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదు, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోంది.

– దీని కోసం రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసింది. కేంద్రం వద్ద ప్రతి నెలా మిగిలిపోతున్న సుమారు 3 లక్షల టన్నుల రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయి, ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుంది.

– రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరింది, కేంద్రం కొత్తగా మంజూరు చేసిన 3 మెడికల్ కాలేజీలతో కలుపుకుని ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఏపీలో ఉన్నాయి. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారు. కావున మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలి. మెడికల్ కాలేజీలో నిర్మాణంపై క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరుగుతున్నాయి.

– కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి.

– విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ఇప్పటికే సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించిన సహాయ సహకారాలు అందించాలి.