ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నేడు ఓ ప్రకటనలో తెలిపింది. రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేస్తారని పేర్కొంది.
అంతేగాక, కార్యక్రమంలో భాగంగా కొంతమంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడుతారని తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొననున్నారు. 2019లో కేంద్రం పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు వాయిదాల్లో అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది.