మేథావుల మౌనం మంచిది కాదు : పయ్యావుల

payyavulaమేధావుల మౌనం మంచిది కాదని, మేధావుల మౌనం వలనే ఈరోజు ఈ విషమ పరిస్థితి వచ్చిందని అన్నారు తెదేపా నేత పయ్యావుల కేశవ్. టీ-బిల్లుపై చర్చ నేపథ్యంలో.. పయ్యావుల ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రసగించారు. అసత్య ప్రచారంతో కూడిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో.. ఆ ప్రాంత ప్రజలకు వాస్తవాలను తెలియజేయడంలో సీమాంధ్ర ప్రాంత మేథావులు విఫలమయ్యారని, అందువల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

విభజనకు ఆత్మగౌరవమే ప్రాతిపదిక అయితే తమ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం ఏమిటని పయ్యావుల ప్రశ్నించారు. ఒప్పందాలు అమలు జరగకపోవడమే విభజనకు ప్రాతిపదిక అయితే శ్రీబాగ్ ఒప్పందం విషయంలో మోసపోయిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెనుకబడటమే విభజనకు ప్రాతిపదిక అయితే, తెలంగాణ కంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటన్నారు. వెనుకబాటు శ్రీకాకుళంలో ఉంది, చిత్తూరులోనూ ఉందని అన్నారు.

తెలంగాణ కంటే రాయల సీమ మరింత వెనకబడి వుందని, ఒక్క పంటతోనే బతుకు పోరాటం సాగిస్తున్న ప్రాంతం రాయలసీమ అని పయ్యావుల అన్నారు. పిల్లలు మినహా ఇంట్లో అందరూ వలసపోయే పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పారు. విభజన జరిగితే రాయలసీమ ఏడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని సభకు తెలిపారు. సమైక్య రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షింప బడతాయని భావిస్తున్నట్లు చెప్పారు.