Site icon TeluguMirchi.com

పవన్‌ యాత్రతో టీ కాంగ్రెస్‌లో భయం

రాష్ట్రం విడిపోయాక బలపడాల్సిన కాంగ్రెస్‌ ఆ లాభంను పొందలేక పోయింది. ప్రత్యేక రాష్ట్రంను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చినా కూడా ఆ పార్టీకి ప్రయోజనం చేకూరలేదు. అధికారంను టీఆర్‌ఎస్‌ పార్టీ ఎగరేసుకుపోయింది. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతామని, కేసీఆర్‌కు ధీటుగా కాంగ్రెస్‌ను నిలుపుతామని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. ఈ సమయంలో తెలంగాణలో పవన్‌ జెండాను ఎగరేస్తాను అంటూ ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణలో తమ పార్టీకి బలం ఉందని, బలం ఉన్న అన్ని చోట్ల తప్పకుండా పోటీ చేస్తామంటూ పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాడు. ప్రస్తుతం తెలంగాణలో యాత్ర నిర్వహిస్తున్న పవన్‌ పార్టీ బలోపేతంకు చర్యలు తీసుకుంటున్నాడు. ఈ సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. పవన్‌ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించకున్నా కూడా అధికారం కోసం ఎదురు చూస్తున్న మాకు అడ్డు పడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు.

టీఆర్‌ఎస్‌పై గత కొన్నాళ్లుగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆ వ్యతిరేకతను క్యాష్‌ చేసుకోవాలని భావించిన కాంగ్రెస్‌ వారికి పవన్‌ రూపంలో షాక్‌ తప్పలేదు. అధికార పార్టీకి సంబంధించిన ఓట్లకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న వారి ఓట్లు మరియు ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు పవన్‌ వైపుకు వెళ్లే అవకాశం ఉంది. దాంతో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరోసారి చేదు ఫలితం తప్పదని రాజకీయ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. అందుకే టీ కాంగ్రెస్‌ నేతల్లో గుబులు మొదలైంది.

Exit mobile version