సీఎం జగన్ కి జనసేనాని బహిరంగలేఖ


ఏపీలో పెన్షన్ దారుల సంఖ్యను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో తెలపాలంటూ దాదాపుగా 4 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ను లేఖ రాశారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. లబ్ధిదారులను తొలగించేందుకు నోటీసుల్లో చూపించిన కారణాలు సహేతుకంగా లేవని పవన్ తన లేఖలో సీఎంకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల కారణంగా అనేక మంది దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు ఆందోళన చెందుతున్నారని పవన్ కళ్యాణ్ సీఎంకు తెలిపారు. కాలం గడుస్తున్నకొద్దీ పెన్షన్ల సంఖ్య పెరుగుతుందని, అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరారు.

పెన్షన్ మొత్తం పెంచుతున్న కారణంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలని చూడడం సరికాదని జనసేనాని సీఎం జగన్‌కు సూచించారు. పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని సీఎంను కోరారు. పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎంకు సూచించారు.