మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను దుమ్మెత్తి పోసిన పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. కొత్త సంవత్సరం సందర్బంగా పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 24 గంటల కరెంట్ గురించి ప్రశంసలు కురిపించాడు. ఇక తాజాగా తెలంగాణలో మూడు రోజులు పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై ఏమాత్రం విమర్శలు గుప్పించలేదు. పైగా కేసీఆర్‌ను వెనకేసుకు వచ్చేలా మాట్లాడాడు. కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం విమర్శలు చేయడం వల్ల నష్టం తప్ప లాభం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ పర్యటన కారణంగా టీఆర్‌ఎస్ బలం పెరిగినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన జనసేనకు ఏమేరకు ఉపయోగం అయ్యిందో తెలియదు కాని కేసీఆర్ అండ్ టీంకు బూస్ట్ ఇచ్చినట్లుగా అయ్యిందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పిన పవన్, కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పకనే చెప్పాడు. మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు జనసేన మద్దతు తెలిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి తెలంగాణలో జనసేన బలపడితే ఖచ్చితంగా అది టీఆర్‌ఎస్‌కు లాభం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.