తిరుపతిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఆయన “వారాహి డిక్లరేషన్” ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం తమ ప్రధాన లక్ష్యమని, పగ, ప్రతీకార రాజకీయాలకు తమ పార్టీ తావు ఇవ్వబోదని స్పష్టం చేశారు. గత దశాబ్దానికి పైగా తనను వ్యక్తిగతంగా అవమానించారని, చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పిన పవన్, తాను ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదని అన్నారు. “వెంకన్నకు అపచారం జరిగితే ఎలా మాట్లాడకుండా ఉంటాం? అన్నీ రాజకీయాలేనా? అన్నీ ఓట్ల కోసమేనా?” అంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరిగిందని బయటకు రాలేదని, కానీ కల్తీ ప్రసాదాలు పెట్టడం వంటి ఘటనలపై తట్టుకోలేకపోయానని చెప్పారు.
తాను ఈ సభకు ఉపముఖ్యమంత్రి గానో, జనసేన అధ్యక్షుడిగానో కాకుండా, సనాతన ధర్మాన్ని రక్షించేందుకే వచ్చానని పవన్ స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని పాటించేవాడిగా, హిందుత్వాన్ని గౌరవించేవాడిగా తాను ఉన్నానని, కానీ ఇతర మతాలను గౌరవించడంలో ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగినప్పుడు దీక్ష చేపట్టానని, దాన్ని అపహాస్యం చేయడం అన్యాయమని పవన్ పేర్కొన్నారు. “సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను. దాని కోసం నా పదవి, నా జీవితం, నా రాజకీయ జీవితం పోయినా నేను వెనక్కు తగ్గను” అని పవన్ కల్యాణ్ పాతాన్ని ధృవీకరించారు.
సనాతన డిక్లరేషన్ :
1) ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2) సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.
3) సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
4) సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5) సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6) ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
7) ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.