అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాణభయం… రక్షణ భాద్యత డీజీపీదే : పవన్ కళ్యాణ్


నెల్లూరు జిల్లా వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి తన భద్రతా సిబ్బందిని కుదించడంపై తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా ఆనం రాంనారాయణరెడ్డి ప్రాణ రక్షణ భాద్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి… శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఆనం రాంనారాయణరెడ్డి గారు తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోంది. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా అయిన రాజకీయ నాయకుడిగా పేరున్న శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారే ఆందోళన చెందుతున్నారంటే మిగిలిన ప్రజాప్రతినిధుల పరిస్థితేంటి? శాసన సభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి.

మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉంది. ప్రభుత్య వ్యవహార శైలి గురించి, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై శ్రీ ఆనం రాంనారాయణరెడ్డి గారు తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరం అని ప్రభుత్వ పెద్దలు నేరంగా భావించినట్లున్నారు. ఆయనకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని శ్రీ రాంనారాయణరెడ్డి గారి ప్రాణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి. ఆయనకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ భాద్యత తీసుకోకపోతే కేంద్ర హోం శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తెలియపరుస్తాను.

అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రాణభయంతో ఉన్నారు. అలాగే స్వేచ్ఛగా మాట్లాడుకొనే పరిస్థితి కూడా లేదు. సొంత ఎమ్మెల్యేలపైనే నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోమ్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? శ్రీ రాంనారాయణరెడ్డి గారు చేసిన ప్రాణ హాని ప్రకటన, శ్రీ కోటం శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తక్షణమే వివరణ ఇవ్వాలి’ అంటూ జనసేనాని డిమాండ్‌ చేశారు.