Site icon TeluguMirchi.com

జనసేన 3 ఏళ్ల విజయాలు

pawankalyan-janasena-radduఅన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన పవన్‌ కళ్యాణ్‌, ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీ నామరూపాలు లేకుండా పోవడంతో కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. మళ్లీ జనసేన పార్టీ అంటూ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం పార్టీని ప్రారంభించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా కేంద్రంలో ఎన్డీయే కూటమికి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి మద్దతుగా పవన్‌ ప్రచారం చేశాడు. పవన్‌కు ఉన్న క్రేజ్‌ ఎన్నికల్లో బీజేపీ మరియు టీడీపీలకు ఉపయోగం అయ్యింది. ఎన్నిక తర్వాత చాలా కాలం వరకు సైలెంట్‌గా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నాడు.

ట్విట్టర్‌ ద్వారా, అప్పుడప్పుడు మీడియా సమావేశాలు, కొన్ని బహిరంగ సభలు, యాత్రలతో ప్రజా సమస్యలపై పవన్‌ పోరాడుతూ వచ్చాడు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ మూడు సమస్యలపై పోరాడాడు. అందులో ప్రత్యేక హోదా ముఖ్యమైనది. పవన్‌ ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా విషయమై స్పందించలేదు. అయితే పవన్‌ ఒత్తిడి కారణంగానే ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.

పవన్‌ ఉద్యమించిన మరో అంశం ఉద్దానం కిడ్నీ సమస్య. ఈ సమస్యపై చాలా సార్లు పవన్‌ స్పందించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్దానం ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పవన్‌ రంగంలోకి దిగిన వెంటనే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి.

పవన్‌ చేపట్టిన మరో ఉద్యమం ఆక్వా ఫుడ్‌ పార్క్‌. స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వం ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు అనుమతులు ఇవ్వడంతో పవన్‌ పోరాడాడు. దాంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇంకా చేనేత పరిశ్రమలు, రాజధాని భూమి నిర్వాషితులు ఇలా పలు ఉద్యమాలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఎన్నో విజయాలు సాధించాడు. 2019లో పవన్‌ సీఎం అయితే మరింతగా ఏపీలో ప్రజల కష్టాలు తీరుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version