ఏనుగుల్లా బతికి… ఎలుకల్లా మారి….!

party-change-leaders-1ఇటీవలి కాలంలో తమ స్వంత పార్టీల నుంచి జంప్ జిలానీలు గా మారి వేరే పార్టీల లోకి దూకిన సీనియర్ నేతల పరిస్థితి దయనీయంగా మారినట్టుగా కనపడుతోంది. స్వంత పార్టీలలో తిరుగులేని నాయకులుగా చెలామణి అయి, రెండో స్థానంలోనో, మూడో స్థానంలోనో వుండి తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో ఆశించి ఇతర పార్టీల గోడలు దూకిన నేతలు ఆయా పార్టీలలో జీరోలుగా మారిన వైనం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానంలో వుండి రాజ్యసభ సభ్యుడిగా, చంద్రబాబుకు సన్నిహితుడిగా మెలగిన మైసూరారెడ్డి తన రాజ్యసభ సభ్యత్వం ముగియగానే ఇక ఈ పార్టీలో పెద్దగా అవకాశాలు ఉండవని భావించి జగన్ పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడికి వెళ్లి కేవలం విలేకరుల సమావేశాలకే ఆయన పరిమితమయ్యారు. విధాన నిర్ణయాలు గైకోనటంలో గానీ, క్రియాశీలక పాత్ర పోషించటంలో గానీ ఆయన చురుకుగా లేరని ఆ పార్టీ వారే చెబుతున్నారు. ఆ మాటకొస్తే జగన్ పార్టీ లో ఒక్క జగన్ కు తప్ప మరెవరికీ అంత సీను ఉండదని వారు చెబుతున్నారు. కాగా రిటైర్ కావలసిన వయసులో ఓపిక చేసుకుని జగన్ పార్టీ గోడ దూకిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిస్థితి కూడా అలానే వుంది. తెలుగుదేశం పార్టీ లో ఆయనది చాలా గౌరవ ప్రదమైన స్థానం.. చంద్రబాబు ఆయనకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఒక దశలో చంద్రబాబు కోటరి లో ఈయన ప్రముఖంగా వున్నారు కూడా. తెలుగుదేశం పార్టీ విధానపరమైన నిర్ణయాలలో ఉమ్మారెడ్డిది కీలక పాత్ర. పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన లో కూడా ఉమ్మారెడ్డి కి చంద్రబాబు అత్యంత విలువ ఇస్తుండేవారు. అలాంటి ఉమ్మారెడ్డి జగన్ పార్టీ లో చేరి డమ్మీ గా మారిపోయారు.

dadi-mysura,ummareddyఇక తెలుగుదేశం పార్టీ నుంచి తాజాగా జగన్ పార్టీ లోకి దూకిన దాడి వీరభద్రరావు పరిస్థితి మరీ విషాదకరంగా మారింది. పక్కలో బల్లెంలా ఆయనకు తన స్వంత జిల్లా అయిన విశాఖ జిల్లాలోనే తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కొణతాల రామకృష్ణ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. తాను ఏమి చేసినా వెంటనే స్పందించి దానిని ఆక్షేపించటానికి కొణతాల సిద్ధంగా ఉంటున్నాడు. తెలుగుదేశం పార్టీ లో దాడి తిరుగులేని స్థానంలో వుండేవారు. పార్టీ లో దాదాపు ఉపనాయకుడు స్థానాన్ని ఆయన ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. చంద్రబాబు కంటే ఉన్నతమైన శాసనమండలి లో ప్రతిపక్షనేత పదవిని ఆయన ఆరేళ్ళ పాటు అనుభవించారు. సరిగ్గా ఆరేళ్ళు సంపూర్ణంగా ఈ పదవిని అనుభవించిన దాడి చివరి రోజు సాయంత్రం అయిదు గంటలకు తాను పార్టీ మారుతున్నట్టు ప్రకటించి తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు. అప్పటిదాకా రాష్ట్రనాయకుడిగా వున్న దాడి జగన్ పార్టీ లో కేవలం విశాఖ జిల్లా నాయకుడిగా మారిపోయారు. కాగా కడియం శ్రీహరి విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ లో అత్యంత ఉన్నతమైన స్థానంలో వున్న నాయకుడాయన. కేవలం తెలంగాణా విషయంలోనే పార్టీ తో విభేదించి తెలంగాణా రాష్ట్ర సమితి లోకి జంప్ చేసారు. ‘ దేశం ‘ లో నిరంతరం కనిపిస్తూనో, వినిపిస్తూనో వుండే కడియం టి ఆర్ ఎస్ లో డమ్మీ అయిపోయారు. అక్కడ కె సి ఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మినహా వేరెవరూ పెద్దగా క్రియాశీలకంగా కనపడరు. కేవలం రాజకీయ భవిష్యత్తు కోసమే కడియం పార్టీ మార్పు నిర్ణయం గైకొన్నారు అన్న ముద్ర కడియం స్వంతం చేసుకున్నారు.

kk-manda-vivekఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే సీనియర్ నాయకులు కె. కె. , మందా జగన్నాథం, వివేక్ లాంటి నాయకులు తెలంగాణా ఉద్యమ నేపధ్య కారణాలతో టి ఆర్ ఎస్ లోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ లో వీళ్ళు తిరుగులేని స్థానంలో వుండేవారు. వీరి మాటలకు గౌరవం, భయం కూడా ఉండేవి. తెలంగాణా విషయంలో అధిష్టానం నాన్చుడు వైఖరి కి నిరసనగా వీరు తమ స్వంత పార్టీ ని వదిలి టి ఆర్ ఎస్ లో కి దూకారు. అక్కడ కర్త, కర్మ, క్రియ అన్నీ కె సి ఆర్ కుటుంబమేనని, కె కె, మందా లాంటి వారు అక్కడికి వెళ్లి ప్రేక్షకుల్లా డమ్మీ లై పోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా నాగం జనార్దనరెడ్డి పరిస్థితి మరీ దయనీయం. తెలుగుదేశం పార్టీ లో వుండగా పార్టీ లో ఉపనేతగా, శాసనసభ లో ఉపనాయకుడిగా వున్న నాగం ‘ దేశం ‘ నుంచి బైటికెళ్ళి స్వంతంగా ఒక పార్టీ పెట్టి అది వర్కవుట్ కాకపోవటంతో, కొంతకాలం టి ఆర్ ఎస్ వైపు చూసి, ఆ తరువాత బి జె పి లో విలీనమై పోయారు. ఇప్పుడు అక్కడా అర్ధం కాని పరిస్థితి. రాబోయే ఎన్నికలలో తెలంగాణా లో బి జె పి కి ఎంతవరకు ఆదరణ లభిస్తుందో తెలియదు కానీ, నాగం మాత్రం సంపూర్ణమైన ఆశతో గడుపుతున్నారు.

ఇలా ఒక పార్టీ నుంచి వేరే పార్టీ లోకి జంప్ చేసిన వారెవరూ సంతోషంగా లేరనేది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని నిశితంగా గమనిస్తే ఇట్టే అర్ధం అవుతుంది. 2014 ఎన్నికలలో జగన్ పార్టీ జయకేతనం గురవేస్తుందనే ఆశతో కొంతమంది ఆ పార్టీలోకి జంప్ చేస్తే, తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ఈ ప్రాంతంలో టి ఆర్ ఎస్ కు భవిష్యత్తు ఉంటుందనే ఆశతో మరికొంతమంది ఆ పార్టీలోకి దూకారు. వీళ్ళ అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఏనుగులు ఎలుకల్లా నిరీక్షించాల్సిందే.