కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మహమ్మారి గమనాన్ని మార్చగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ సాధ్యమైనంత ఎక్కువమందికి టీకాలు అందించాలని, ప్రజలను రక్షించుకునేందుకు కట్టడి చర్యలను పాటించాలని సూచించింది. ఒమిక్రాన్.. అంతర్జాతీయ సంక్షోభంగా మారకుండా మనం నిరోధించగలం. వైరస్ మారుతోంది, కానీ మన సంకల్పం మాత్రం మారకూడదు’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.
డెల్టా కంటే ఒమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉన్నాయని ప్రారంభ నివేదికలను బట్టి తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందన్నారు. ‘వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, అసాధారణ మ్యుటేషన్లు కలిగిన ఒమిక్రాన్.. మహమ్మారి గమనంపై భారీ ప్రభావాన్ని చూపుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి’ అని అన్నారు.