జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఐదో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి. నవంబరులో రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జులైలో జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం. నవంబరు నెలకుగానూ రూ.1,31,526 కోట్ల జీఎస్‌టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో కేంద్ర GST (CGST) రూ.23,978 కోట్లు కాగా.. రాష్ట్రాల GST (SGST) రూ.31,127 కోట్లు. సమ్మిళిత జీఎస్‌టీ (IGST) కింద రూ.66,815 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.32,165 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ.9,606 కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.