టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ మరో నేతను కోల్పోయింది. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో హాస్పటల్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. కాగా, గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స అనంతరం కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు.

1956లో జన్మించిన నర్సింహయ్య ఎంపీపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఎం తరఫున పోటీచేసి రెండుసార్లు నకిరేకల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు.

నోముల నర్సింహయ్య మరణంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నోముల నిలిచిపోతారని చెప్పారు. నోముల మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటన్నారు. అలాగే ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ వెంట నడిచిన గొప్పనాయకులన్నారు. నోముల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.