కళంకితులను “కళంకితులు” అంటే తప్పా!

geeta reddy kaanna lakhminarayna ponnalaప్రజాసమస్యలను ప్రాస్తావించాల్సిన శాసనసభలో.. ఆ ప్రజాసమస్యలను తీర్చే మంత్రుల పైనే చర్చ జరగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సభలో  “కళంకిత మంత్రులు” అంటూ.. ప్రస్తావించడంతో.. గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లు.. తాత్కాళిక హోంమంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న గీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. “మేము కళంకిత మంత్రులమయితే.. చంద్రబాబు కళంకితుడు కాదా” అంటూ ఒంటికాలుపై లేచినంత ప్రయత్నం చేశారు. దీనిపై తెదేపా నేతలు కూడా గట్టిగానే ప్రతిస్పందించారు. కళంకిత మంత్రులను ముందు పెట్టుకొని ప్రభుత్వం శిఖండిలా వ్యవరిస్తోందని దయ్యబట్టారు.

నేతల ఆరోపణలు-ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ మంత్రుల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే..

* వైఎస్ హయాం నుండి మూడో కృష్ణుడు కిరణ్ కుమార్ రెడ్డి వరకు రాష్ట్ర మంత్రి మండలి దొంగల బండిలా తయారైంది. కాంగ్రెస్ నేతలు, మంత్రులు విచ్చల విడిగా అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులు యథేచ్ఛగా దోచుకున్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలు, ఓయంసీ, ఎమ్మార్, జగన్ అక్రమాస్తులు, జలయజ్ఞంలాంటి అన్నింటికీ కూడా అంతే బాధ్యులు.

* విదేశాల నుండి బొగ్గు దిగుమతుల్లో రూ. 400 కోట్లు స్వాహా చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్పై ఆ పార్టీకి చెందిన నేతలే ఆరోఫణలు చేశారు. వైస్ ఛాన్సులర్ పోస్ట్లు అమ్మినట్టు బదిలీల్లో ముడుపులు తీసుకున్నట్లు, మధ్యం అమ్మకాల్లో ఏటా రూ. 2 వేల కోట్ల ముడుపులు, తమ్ముళ్ళ ద్వారా కౌంటర్లు పెట్టి వసూళ్ళు చేస్తున్నట్లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

* హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై 120బి, 409,420 సెక్షన్ల కింద, అవినీతి నిరోధక చట్టం 8, 12, 13, 13(1) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఛార్జిషీట్ లో నిందితురాలిగా ఉంటూ కూడా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని మొన్నటి వరకు కూడా కొనసాగించారు. మంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డి ఫ్యాక్షనిస్టులను ఉపయోగించుకుని సెటిల్ మెంట్లు చేస్తున్నారని, హంతకుల ముఠాలతో సంబంధాలు కలిగి వున్నట్లు కథనాలు వచ్చాయి.

* భారీ నీటి పారుదల శాఖను నిర్వహించిన మంత్రిపొన్నాల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కాంట్రాక్టర్ల వద్ద నుంచి వేల కోట్ల రూపాయలు దండుకుని సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పారనే ఆరోపణలున్నాయి.

*వాన్ పిక్ కుంభకోణంలో సీబీఐ ఛార్జీషీట్ లో ఐదో నిందుతుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మంత్రి, యుఎల్ సి భూముల క్రమబద్దీకరణలో అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం నడిబొడ్డున కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుమారుడికి గిరిజన ప్రాంతాలలో కన్నెధారకొండ గ్రానైట్ గనులు కేటాయించుకున్నారు.

* మేఘమధనం, మిక్సింగ్ ప్లాంట్లకు ఎరువులు సరఫరా మరియు సబ్సిడీ విత్తనాల పంపిణీలో రూ. 1000 కోట్ల అవినీతికి రఘువీరారెడ్డి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి భూముల వివాదంలో లోకాయుక్త కేసు నమోదు అయింది.

* గుంటూరులో ఒక చిన్న బుడ్డీకొట్టు నడుపుకుంటూ సైకిల్ పై తిరిగిన మంత్రి కన్నా లక్ష్మినారాయణ వేల కోట్లు ఆర్జించారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో కన్నా కుమారుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి 5 ఎకరాలు అక్రమంగా కేటాయించారు.

* లిక్కర్ వ్యాపారాలు, భూకబ్జాలు, ఇసుక, కుంభకోణాల్లో మునిగి తేలుతూ.. లిక్కర్ డాన్ గా పేరు తెచ్చుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ వేల కోట్లు ఆర్జించారు.

* పార్థసారధి గతంలో కేపీఆర్ టెలిప్రొడక్ట్స్ ఎండీగా ఉన్నకాలంలో యంత్రాలు కొనుగోలు చేసిన సందర్భంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించలేదు. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ ఈడీ ఫెరా చట్టం కింద ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లఘించినందుకు రెండు నెలలు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా కూడా విధించడం జరిగింది.

* కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో మంత్రి శైలజానాధ్ రూ.25 కోట్లు నల్లధనానికి హామిగా ఉంటానని చెప్పి మనీలాండరింగ్ లో అడ్డంగా దొరికిపోయాడు.

*  రూ. 1000 కోట్ల విలువ చేసే పవర్ ప్రాజెక్ట్ లు కలిగి ఉన్నట్లు మంత్రి జానారెడ్డిపై ఆరోపణలు వచ్చాన విషయం తెలిసిందే.

ఇలా చెప్పుకొంటూ పోతే.. కాంగ్రెస్ మంత్రుల చరిత్ర కాస్త.. “కళంకిత మంత్రుల చరిత్రలా” మారిపోతుందని కొందరి వాదన. సీఎం, హోం, పంచాయితీ, రెవెన్యూ, విద్యా.. ఇలా అన్ని శాఖల మంత్రులు కూడా అవినీతిలో భాగస్వాములు అయినప్పుడు ఆ మంత్రివర్గాన్ని కళంకిత మంత్రివర్గం అందులోని మంత్రులను కళంకిత మంత్రులు అనకుండా ఇంకేమంటారని ఓ సాధారణ పౌరుడి మాట.

ప్రజల సమస్యలను తీర్చే మంత్రులే..  బకాసురుల్లా ప్రజాసొమ్మును కాజేస్తుంటే.. వారిని ‘కళంకితులు’  ప్రస్తావించడంలో తప్పులేదని, కానీ శాసనసభలో ఉన్నప్పుడు కూడా అలా పిలవడం బహుశ.. వారికి ఇబ్బందిని కలిగించి వుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.