మిలీనియం మార్చ్ అవసరం లేదు!

Dr_-J_-Geetha-Reddyతెలంగాణ ప్రజలు సంయమనం పాటించడం వల్లే శనివారం హైదరాబాదులో ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం అయిందని మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. దివారం కరీంనగర్ విచ్చేసిన ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సభ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేసిన ఘటన దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. గాయపడిని కానిస్టేబుల్ను టి.మంత్రులు పరామర్శిస్తామని తెలిపారు. అయితే నిజాం కాలేజీలో పోలీసుల లాఠీచార్జీ ఘటన బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి ఉన్నారని గీతారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక ఏపీఎన్జీవోల మిలియన్ మార్చ్ పై ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై మిలియన్ మార్చ్ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. ఈ ఆలోచన చేస్తే మద్రాస్ వలే గెట్ లాస్ట్ అనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీఎన్జీవోలు నగరంలోని శాంతియుత వాతావరణాన్ని కల్మషం చేశారని అన్నారు. సీమాంధ్రుల కోట్ల రూపాయలతో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తానని తెలిపారు. తెలంగాణ గడ్డ మీద జై తెలంగాణ నినాదాలు చేసే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని ఈటెల ప్రశ్నించారు. జై తెలంగాణ అన్న వారిని కొట్టారని తెలిపారు. నిన్న జరిగిన సభ వెనుక సీఎం కిరణ్ హస్తం ఉందని దీంతో రుజువైందని అన్నారు.