విస్తరణం హుళక్కేనా?

cm-kiranరవీంద్రారెడ్డి,శంకర్రావులను బయటకు పంపడం, ధర్మాన, సబిత, మోపిదేవి తదిరుల రాజీనామాలు ఆమోదించడంతో రాష్ర్ట మంత్రివర్గ విస్తరణ అనివార్యంగా మారింది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నాన్పుడు వైఖరి, ఆ పార్టీలో నెలకొన్న మితిమీరిన ప్రజాస్వామ్యం తదితర వ్వవహారాలు చూస్తుంటే, విస్తరణ సజావుగా సాగుతుందా అన్న అనుమానం కలుగుతోంది. మొన్నటికి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి విస్తరణ గురించి అధినేత్రి సోనియాతో మాట్లాడి వచ్చారు. కానీ అందుకు ఆమె అనుమతి ఇచ్చిన దాఖలాలు ఏమీ కనబడలేదు.

అయితే మహిళా కమిషన్ పునరుద్ధరణ, రవీంద్రారెడ్డి బర్తరఫ్ సంగతులు చూస్తుంటే ఏదో కొంత భరోసాతోనే కిరణ్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చనట్లు కనిపిస్తోంది. కానీ అంతలోనే సిఎమ్ వ్యతిరేకులు ఏకమయ్యారు. చిరంజీవి సోనియాను కలిసారు. బొత్స ఢిల్లీలోనే వుండి మంతనాలు సాగిస్తున్నారు. మిగిలిన నేతలు కూడా దాదాపు ఇదే పనిపై వున్నారు. ఇక డిప్యూటీ సిఎమ్ దామోదర రాజనర్సింహ సంగతి చెప్పనక్కరలేదు.

మొత్తం మీద సిఎమ్ ను మార్చాలి లే దా, కనీసం ముకుతాడు వేయాలన్న లక్ష్యంతో వీరంతా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు, మరోపక్క పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మంత్రివర్గ విసర్తణ జరుగుతుందా..అందుకు పార్టీ ధైర్యం చేస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. మొండిగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటే అది జగన్ పార్టీలోకి మరికొంత మందిని పంపేదుకే అవుతుంది తప్ప వేరు కాదు. ఇప్పటికే రెడ్లు కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెంచుకుంటున్నారు. రవీంద్ర రెడ్డిని బయటకు పంపడం, అదే సమయంలో కాపు కులానికి చెందిన త్రిపురానకు మహిళా కమిషన్ పదవి కట్టబెట్టడం వారికి ఇబ్బందిగా కనిపిస్తోంది.

మరోపక్క ఏకంగా కాంగ్రెస్ పరిశీలకుడు అజాద్ పైనే ఆరోపణలు వస్తన్నాయి. ఇక ఇలాంటి సమయంలో మంత్రివర్గ విస్తరణ అంటే, మరిన్ని మాటల తూటాలను ఎదుర్కోవలసి వస్తుంది. బొత్స, చిరంజీవి, సిఎమ్, తెలంగాణా, ఆంధ్ర, సీమ,కుల సమీకరణలన్నీ లెక్కగట్టి, ఎంపిక కసరత్తు సాగించడం అంత సులువు కాదు. దానా దీనా తేలేదేమిటంటే, మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో యుపిఎ తన ప్రకటనల ప్రచారాన్ని ప్రారంభించేసింది. అంటే ఎన్నికలు దగ్గరలోకి వచ్చినట్లే భావించవచ్చు. అందువల్ల విస్తరణను వదిలేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.