Site icon TeluguMirchi.com

తెలంగాణ వాదులకు ‘బెయిల్ బంద్’

no-bail-for-telangana-agita‘సడక్ బంద్’ సందర్భంగా అరెస్టై జైలులో ఉన్న తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులకు మహబూబ్ నగర్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. టీ-రాజకీయ జేఏసీ ఛైర్మెన్ కోదండ రాం, తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తదితర తెలంగాణ నేతల బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. సండక్ బంద్ కు నాయకత్వం వహించిన కోదండరాంపై 147, 148, 341, 188, 427, 109, రెడ్ విత్ 149తో పాటు పీడీపీపీ యాక్టు నమోదు చేశారు. మొత్తం 11 మందిపై కేసులు నమోదు కాగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తికాకపోవడంతో పాటు కొంతమంది పరారీలో ఉన్నకారణంగా బెయిల్ నిరాకరిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

కాగా, నిన్న తెలంగాణ రాజకీయ ఐకాస చేపట్టిన ‘సడక్ బంద్’ కు సంబంధించి పోలీసులు దాదాపు 1177 మంది తెలంగాణవాదులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో జెఏసి, తెరాస నేతలు కూడా ఉన్నారు. అయితే తెలంగాణ వాదుల అరెస్ట్ వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీల హస్తం ఉందని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు ‘సడక్ బంద్’ సందర్భంగా.. తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులు, తెలంగాణ వాదుల అరెస్టులకు నిరసనగా రేపు (శనివారం) తెలంగాణ బందుకు ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి, ప్రజా సంఘాల ఐకాస పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version