Site icon TeluguMirchi.com

నిమ్మగడ్డ తొలగింపు..మళ్ళీ రాజకీయం


ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మార్చి 15న రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. అయితే దీనిపై సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అప్పట్లో దీనిపై పెద్ద రాజకీయమే నడిచింది. ఇప్పుడు మళ్ళీ తొలగింపు నేపధ్యంలో ఆ రాజకీయం మళ్ళీ తెరపైకి వచ్చింది.

Exit mobile version