Site icon TeluguMirchi.com

భాజపాకు కొత్త మాస్కు

modiచిరకాలం పాటు భారతీయ జనతాపార్టీకి ఓ మాస్కు వుండేది. దాని పేరు అటల్ బిహారీ వాజపేయి. భారతీయ జనతాపార్టీలో అతివాద హిందూత్వ విధానాలు బయటకు కనిపించకుండా ఈ మాస్కను వాడేవారు. పైగా జనంలో అటల్ బిహారీ అంటే వుండే అభిమానం కూడా ఇందుకు ఓ కారణం. అతివాద వ్యవహారాలు చూసే అద్వానీలాంటి వారు ఈ మాస్కు వెనకే వుండేవారు. కానీ ఒక తరుణంలో మాస్కు వల్ల మంచి పేరు తప్ప అధికారం రావడం లేదని, అద్వానీ బయంటకు వచ్చి రథాయాత్ర చేయాల్సి వచ్చింది. అప్పుడు భాజపా అసలు సిద్ధంతాలు అన్నీ జనాలకు బాగా తెలిసాయి.తెలియనివారికి మిగిలిన రాజకీయ పక్షాలు తెలియచెప్పాయి.

మొత్తానికి ఆ విధంగా భాజపాను ఓ బూచిలా మార్చి, సెక్యులర్ విధానాల పేరు చెప్పి, ఎవరినీ అటు పక్క వెళ్లకుండా కట్టడి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. అటు వెళ్లడం సరే, ఇటు రావడం ఇష్టం లేని వారు తటస్ఠంగా వుండిపోయారు. అలాంటి వారి సంఖ్య తక్కువ కాబట్టే, ఈ దేశంలో తృతీయ ఫ్రంట్ సాధ్యం కావడం లేదు. సరే, వయసు మీదపడడం, పార్టీలో అతివాదుల పట్టు పెరగడంతో వాజపేయి పక్కకు తప్పుకున్నారు. అద్వానీ తన కల నెరవేర్చుకుని, ప్రధాని పీఠం ఎక్కాలని అనుకుంటుంటే, పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది. అద్వానీని మించిన అతివాది నరేంద్ర మోడీ వేదికపైకి వచ్చారు. ఆ వేళ వాజపేయి స్థాయిలో ఇప్పుడు అద్వానీ వుండాల్సి వచ్చింది. కొత్త అతివాదికి దారివ్వక తప్పడం లేదు.

గుజరాత్ అభివృద్ధిని, అక్కడి విజయాలను ఎరగా, భూతద్ధంలొ చూపించి, దేశవ్యాప్తంగా అధికారం సాధించాలని భాజపా అతివాదులు కలలు కంటున్నారు. ఆ దిశగా వారు పార్టీని పయనింప చేస్తున్నారు. ఇప్పుడు మోడీని ప్రచార సారథిగా చేసారు. నేరుగా ప్రధాని అభ్యర్థి అంటే అద్వానీతో, ఆయన అభిమానులతో ఇబ్బందులు వస్తాయి కనుక, అదే విధంగా దగ్గర కావాలనుకున్న లౌకిక పార్టీలు వెనక్కు తగ్గుతాయి కనుక, ఈ విధమైన అడ్డస్టుమెంటు.

ఈ సంగతి అలా వుంచితే ఇన్నాళ్లకు భారతీయ జనతాపార్టీ సరియైన మాస్కును ముఖానికి తగిలించుకుంది. ముఖం, మాస్కు ఒకటే అయినపుడు నిజానికి ఇక మాస్కుతో పనిలేదు. పైగా మాస్కు పెట్టుకున్నా ఓట్లు రాలనపుడు ఇక క్లయిమాక్సులోనైనా అసలు ముఖం చూపించేసి, ఫలితం ఎలా వుంటుందో చూడాలని భాజపా అనుకుంటున్నట్లంది. అతివాదానికి..మితవాదానికి నడుమ గోడమీద పిల్లిలా వుంటే, ఎవరికీ నచ్చడం లేదు. ఇక ఒకటే బాట తీసుకుంటే ఎలావుంటుందో అని ఆలోచించి, భాజపా ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది. ఆ విధంగా మోడీ భాజపాకు ఇప్పుడు సరియైన మాస్కుగా మారాడు. కానీ ఇక్కడ సమస్య ఒకటి వుంది. మోడీని అభిమానించేవారు..ట్వీట్ చేసేవారు, ఫేస్ బుక్ లో ఫాలో అయ్యేవారు..పోలింగ్ బూత్ లకు వస్తారా అన్నదే ప్రశ్న. అక్కడే వుంది అసలు కీలకం.

Exit mobile version