దేశానికి కొత్త రక్తం

tdp-Signature-Collection-onశస్త్ర చికిత్స కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. కానీ తీరా విజయవంతంగా పూర్తయ్యాక, ప్రాణం హాయిగా వుంటుంది. అందరూ తెలుగుదేశం పార్టీని వీడిపోతున్నారన్న ప్రచారం మాస్ హిస్టీరియాలా అలుముకుంటోంది కానీ, ఇది ఒక విధంగా తెలుగుదేశానికి మేలే చేస్తుందనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు, ఎన్టీఆర్ ఏరికోరి ఎంపిక చేసిన అభ్యర్థులందరూ పాతిక, ముఫై ఏళ్ల నవ యువకులు. కొత్తగా రాజకీయాల్ల్లో కాలూనిన వీరంతా కాకలు తీరిన నేతలుగా ఎదిగారు. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఓ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. వీరిని కాదని వేరే వారికి టిక్కెట్లు కేటాయించే పరిస్థితి వుండేది కాదు. చంద్రబాబు ఎంత కాదనుకున్నా కూడా వీరికే టిక్కెట్లు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చేది… వస్తోంది కూడా. దీనివల్ల నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతగా ఎదగలేదు. ఇవ్వాళ కాకుంటే, రేపు అన్నది వుంటేనే, ఎవరన్నా ఆశగా పార్టీని నమ్ముకుని, అంటిపెట్టుకుని వుంటారు. మర్రిమాను నీడలో మరే మొక్కలు మొలవవన్నట్లు, ఈ సినియర్ల నీడలో జూనియర్లు మనలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సంగతి బాబుకీ తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

పార్టీకి యువరక్తం కావాలి, కానీ కొత్త రక్తం తెచ్చే పరిస్థితి లేదు. అందుకే సీనియర్ల వారసులనే ప్రోత్సహించాలనుకున్నారు. దాడి వీరభద్ర రావు కుమారుడు రత్నాకర్ ను అలాగే పైకి తెచ్చారు. కానీ ఇదీ పార్టీ ప్రగతికి అవకాశం ఇచ్చేది తక్కువే. అందుకే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు, కింది స్థాయి నాయకులు వేరే పార్టీల్లో అవకాశాల కోసం చూస్తున్నారు. ఇప్పుడు సీనియర్లు, ఇన్నాళ్లుగా తమకు అన్నీ ఇచ్చిన పార్టీ, ఇక గెలవదేమో, దానికి ప్రగతి లేదేమో అని భయపడుతూ, పక్క పార్టీల్లోకి దూకుతున్నారు. ఇది చంద్రబాబుకు మంచి అవకాశం. అలా భయపడే నేతలు వెళ్లిన ప్రతి చోటా యువతకు, ద్వితియ శ్రేణి నాయకులకు అవకాశం ఇవ్వడం పార్టీకి మంచి చేస్తుంది. ఎలాగూ యువతకు, బిసి లకు వంద సీట్లు ఇస్తామని బాబు హామి ఇచ్చారు. దాన్ని నెరవేర్చుకున్నట్లూ అవుతుంది.

నాయకులు పార్టీ మారినంత ఈజీగా అభిమానులు కార్యకర్తలు మారరు. మారేది చోటామోటా నాయకులే. కానీ ఈలోగా కొత్త నాయకుడు వస్తే మళ్లీ మామూలే. అందువల్ల నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీకి గడ్దుకాలం అన్నది అన్నిచోట్లా ఒకేలా ఉండదు. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి వున్న అద్భుతమైన అడ్వాంటేజ్, పార్టీ నిర్మాణం, యంత్రాంగం, నిర్వహణ. అది రాష్ర్టంలో మరే పార్టీకి లేదు. సరియైన పార్టీ యంత్రాంగం లేకుండా నాయకులు చేసేది ఏమీ వుండదు. అందువల్ల మరక మంచిదే.