తెలంగాణకు కొత్త గవర్నర్‌ రాబోతున్నారా?

గత పది సంవత్సరాలుగా గవర్నర్‌ విధులు నిర్వర్తిస్తున్న నరసింహన్‌కు కేంద్ర ప్రభుత్వం విముక్తి కలిగించబోతున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో నరసింహన్‌కు ప్రత్యేకమైన అనుబంధం పెనవేసుకు పోయింది. ఈ పదేళ్లలో ఆయన మొత్తం తెలుగు నేర్చుకోవడంతో పాటు, అనర్గలంగా మాట్లాడగలుగుతున్నారు. మరే గవర్నర్‌ కూడా ఈమద్య కాలంలో ఇంత కాలం పదవిలో కొనసాగింది లేదు. ఎట్టకేలకు ఏపీకి కొత్త గవర్నర్‌ రాగా తెలంగాణకు కూడా కొత్త గవర్నర్‌ రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తెలంగాణకు ఏపీకి చెందిన ఒక బీజేపీ నాయకుడు వస్తాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒక వేళ ఏపీకి చెందిన నాయకుడు కాకుంటే ఉత్తరాదికి చెందిన బీజేపీ నాయకుడు అయినా తెలంగాణ రాష్ట్రంలో కొత్త గవర్నర్‌గా విధులు స్వీకరించబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది చివరి వరకు ఖచ్చితంగా గవర్నర్‌ మార్పు ఉంటుందని, బీజేపీ నాయకుడికి తెలంగాణ గవర్నర్‌ పదవి ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.