కొత్త జీవితంలో అడుగుపెట్టే ముందు కుటుంబ సభ్యులతో కలిసి నూతన దంపతులు దైవ దర్శనానికి బయలుదేరారు. సందడిగా సాగుతున్న ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. వరదనీటి రూపంలో మృత్యువు ఆ జంటను విడదీసింది. అందరూ చూస్తుండగానే కొత్త పెళ్లి కూతురు మరణించింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
కర్నాటక లోని రాయచూర్ జిల్లాకు చెందిన సంధ్య అనే యువతికి ఇటీవలే హరీష్ అనే యువకుడితో పెళ్లైంది. పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొత్తజంటతో పాటు కుటుంబ సభ్యులు బయలుదేరారు. రాయచూర్ నుంచి తిరుపతికి వచ్చారు. తిరుమల వైపు వెళ్తుండగా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద నున్న అండర్ బ్రిడ్జిలో నీరు నిలవడంతో ఏడుగురితో ప్రయాణిస్తున్న పెళ్లి వాహనం మునిగింది.వాహనం నీట మునగడంతో ఊపిరి ఆడక నవ వధువు సంధ్య అక్కడే మరణించింది.విషయం తెలుసుకున్న ఎస్ వీ యునివర్సిటీ పోలీసులు ఘటణా స్థలాన్ని చేరుకొని బాదితులను కాపాడారు. కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.