12వ బారక్‌లోకి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా !

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు టోపీ పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, తనపై వస్తున్న మనీ ల్యాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని బ్రిటన్ కోర్టులో తెలిపి బెయిల్ పొందారు. తాను మోసగాడిని కాదని, అలాగే బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని కూడా తెలిపాడు. భారతీయ జైళ్లలో సరైన సదుపాయాలు ఉండవని, అక్కడ సదుపాయాలు కల్పిస్తే తాను వెళ్లేందుకు సిద్ధమేనని మాల్యా కోరినట్లు లండన్ కోర్టు ఆ విషయాన్ని సిబిఐకి తెలిపింది.

అయితే బ్రిటన్ నుండి విజయ్ మాల్యాను భారతదేశం పంపించాలంటే విజయ్ మాల్యాకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆ దేశ కోర్టు తెలిపింది. భారతదేశంలో మాల్యాను ఎలాంటి జైలులో ఉంచాలని అనుకుంటున్నారో ఆ జైలులో సకల సదుపాయాలు ఉండాలని, ఆ జైలు తాలూకా వీడియోలను కోర్టుకి పంపించాలని కూడా తెలిపింది. ప్రస్తుతం సిబిఐ అధికారులు మాల్యాకు సకల సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు.

ముంబై ఆర్ధర్‌రోడ్‌లోని 12వ బారక్‌లో అన్ని వసతులతో కూడిన గదిని మాల్యాకి సమకూరుస్తామని తెలియజేశారు. విజయ్ మాల్యాను ఉంచబోయే ఆర్ధర్‌రోడ్‌లోని జైలులో టెలివిజన్ సెట్‌తో పాటు మంచం, వ్యక్తిగత టాయిలెట్ ఉండేలా చూస్తామని కూడా తెలిపారు. మాల్యాను ఉంచబోయే ప్రదేశాన్ని వీడియో షూట్ చేసి.. ఎనిమిది నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీగా తయారుచేసి లండన్ కోర్టులో దాఖలు కూడా చేశారు. ముంబై ఆర్థర్‌రోడ్ జైల్లోని బరాక్ 12లో కాస్త హై ప్రొఫైల్ ఉన్న ఖైదీలను మాత్రమే ఉంచుతారు.