ఆర్టికల్ 370 రద్దు ఫై భిన్నాభిప్రాయాలు..

ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ లో ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసింది. ఇక నుంచి కాశ్మీర్‌లో కూడా కేంద్ర చట్టాలు అమలుకానున్నాయి. జమ్ముకాశ్మీర్‌ను కేంద్రం రెండుగా చీల్చింది. చడ్డ సభలేని కేంద్రంగా లడఖ్ ప్రాంతాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్టికల్‌ 370 రద్దు చేయడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత చీకటి దినం. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారు. భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం’ అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘భారత ప్రభుత్వం ఉద్దేశమేంటో ఇప్పుడు తేలిపోయింది. ప్రజలను భయపెట్టి కశ్మీర్‌ను లాక్కోవాలని చూస్తున్నారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భారత్‌ విఫలమయింది. కశ్మీర్‌ను ఆక్రమించిన దేశంగా భారత్‌ మిగిలిపోతుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ ఇది అద్భుతమైన రోజు. ఎట్టకేలకు జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలన్న శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మొదలుకొని ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయి. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇక తెరపడింది. జీవితంతో అసలు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించామా?’’ అని రామ్‌ మాధవ్‌ ట్వీట్‌ చేసారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బహుజన్‌ సమాజ్‌ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సతీష్‌ చంద్ర మిశ్రా రాజ్యసభలో మాట్లాడుతూ.. కేంద్రం ఈరోజు ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఎస్పీ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. అధికరణ 370రద్దుతో పాటు ఇతర ఏ బిల్లులనూ వ్యతిరేకించమని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం భాజపాపై గుర్రుగా ఉన్న ఈ పార్టీ అనూహ్యంగా కేంద్రానికి మద్దతుగా నిలవడం గమనార్హం.