Site icon TeluguMirchi.com

మోడీ ప్రయత్నం.. ఎన్నికల కోసమేనా..?


అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తోన్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని.. దాని స్థానంలో 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మించారని భావిస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న బాబ్రీ మసీదు 1992లో కూల్చివేతకు గురైంది. అప్పటి నుంచి ఈ స్థలం ఎవరికి చెందుతుందనే విషయమై వివాదం నడిచింది. ఇక్కడ రామ మందిరం నిర్మిస్తామని మూడు దశాబ్దాలుగా బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇస్తోంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. వివాదాస్పద రెండున్నర ఎకరాల భూమిని రామాలయం నిర్మించడానికి వీలుగా ట్రస్ట్‌కు అప్పగించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరో చోట ఐదెకరాల స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది.

2024 ఎన్నికలకు ముందే అయోధ్య రామ మందిరం ప్రారంభించేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ప్రారంభ తేదీని కూడా బీజేపీ నేతలు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే సరిగ్గా ఏడాదిలోపే అయోధ్యలో శ్రీరాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ అడ్డుకున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘ కాలం ఉండేలా చేశాయని బీజేపీ శ్రేణులు విమర్శించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో.. ప్రధాని మోదీ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని కాషాయం నేతలు గుర్తు చేశారు. 2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ ఆలయం ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లేందుకు కమలం పార్టీ ప్లాన్ చేస్తుంది.

ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో.. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2024 ఆరంభంలో రామ మందిరం ప్రారంభమైతే.. ఆ ఏడాది మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అయోధ్య రామజన్మభూమి అంశం ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version