నరసింహన్‌పై ఏపీలో బీజేపీ మరియు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన నరసింహన్ ఆ సమయంలో ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించాడు. కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్ అంటూ ఇకపై అంతా పిలుస్తారని కితాబిచ్చాడు. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడటం లేదు. గవర్నర్ స్థాయి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గవర్నర్ అనే వ్యక్తి తటస్థంగా ఉండాలి అనేది నియమం. అయితే ఉన్నది ఉన్నట్లుగా కూడా చెప్పవచ్చు. కాళేశ్వరం పనులు ఆయనకు నచ్చి, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌ను అభినందించి అలా అన్నాడు అంటూ టీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. అయితే కొందరు సామాన్య జనాలు మరియు రాజకీయ విశ్లేషకులు కూడా గవర్నర్ ప్రభుత్వంకు వత్తాసు పలికేవిధంగా మాట్లాడుతున్నాడు అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తన స్థాయిలో వ్యవహరించాలని రాజకీయ విశ్లేషకులు సైతం సలహా ఇస్తున్నారు.