గౌరవనీయులైన శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
అమరావతి
విషయంః గ్రామపంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ.1309 కోట్లు తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమచేయాలి.
అయ్యా!
మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ మూడింటి పై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం. ఈ మూడు మార్గాలు అయిపోయాయి. ఇప్పుడు నిధుల మళ్లింపు మీదపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 12,918 పంచాయతీల నుంచి మీ రెండున్నరేళ్ల పాలనలో రూ.1309 కోట్లకు పైగా నిధులు మళ్లించడంతో కనీసం పంచాయతీ పారిశుధ్య పనులకి కూడా రూపాయి లేని దుస్థితిలో వున్నాయి. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులని దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి. పల్లెల్లో పారిశుధ్యపరిస్థితి పూర్తిగా దిగజారింది. పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా ఇచ్చిన రూ.1309 కోట్లను పంచాయతీ ఖాతాల నుంచి మళ్లించడం రాజ్యాంగవిరుద్ధం. సర్పంచ్, వార్డుసభ్యులకు తెలియకుండా, పంచాయతీ బోర్డు తీర్మానంలేకుండా…ఆయా పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానికసంస్థల ప్రతినిధులని ప్రభుత్వం మోసం చేయడం కిందకే వస్తుంది. ముందురోజు పంచాయతీల ఖాతాలో ఉన్న సొమ్ము తెల్లారేసరికి మాయమై, జీరో బ్యాలన్స్ చూపడం అంటే రాష్ట్రప్రభుత్వమే సర్పంచ్‌లను, పంచాయతీ పాలకవర్గాలను వంచించడమే.
సుమారు 4 నెలల క్రితం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 344 కోట్లను విద్యుత్ బకాయిల క్రింద జమ వేసుకున్నామని, ఇప్పుడు ఆర్థికమంత్రి ప్రకటించడం బాధ్యతారాహిత్యం. 1984 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారు ఎటువంటి ఆదాయంలేని మైనర్ పంచాయతీలకు వీధి దీపాలకు ఉచిత విద్యుత్‌ని అందించగా, దీనిని తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, వై. యస్. రాజశేఖర్ రెడ్డి గారు , కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కొనసాగించారు. దశాబ్దాలుగా ఉచితవిద్యుత్ ప్రయోజనం అందుకుంటోన్న పంచాయతీల నుంచి ..మీరు పంచాయతీ కార్యవర్గాలకు తెలియకుండా రూ. 344 కోట్లు విద్యుత్ పాతబకాయిల పేరుతో తీసుకోవడం సర్కారు గూండాగిరీ కిందకే వస్తుంది. మళ్లించడానికి వీలులేని కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన ఆర్థిక సంఘం నిధులనీ వాడేశారంటే, పూర్తిగా బరితెగించేశారని అర్థం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధలైన పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ (ఆర్ఈసీ)కి జెన్‌కో, ట్రాన్స్‌కో బాకీపడిన రుణం తీర్చి, మళ్లీ కొత్త అప్పు కోట్ల రూపాయలు కేంద్ర ఇంధనశాఖ నుంచి తెచ్చేందుకు నిబంధనలు తుంగలోతొక్కి మరీ పంచాయతీల నిధులు తరలించుకుపోవడం పై మీరు సమాధానం ఇవ్వాలి. గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, మైనింగ్ సెస్, వృత్తి పన్ను, తలసరి గ్రాంట్, నీటితీరువా పన్ను, ఇసుక &మైనింగ్ పై వచ్చే ఆదాయాలు వేల కోట్లు ఎగవేసి, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాడేయడం చాలా దుర్మార్గమైన చర్య. మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతే. అటువంటి సర్పంచుల్ని ఆటబొమ్మల్ని చేసి, పంచాయతీల నిధులు దారిదోపిడీ దొంగలా ప్రభుత్వమే మాయం చేయడం చాలా అన్యాయం. 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.344 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.965 కోట్లు తక్షణమే పంచాయతీల ఖాతాల్లో జమచేయాలి. గ్రామాలలో అభివృద్ధికి సహకరించాలి. పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యంచేసే రాజ్యాంగేతర చర్యలు మానుకోవాలి. రాజకీయాధిపత్యం కోసం ప్రకటించిన ఏకగ్రీవాల పారితోషికం పంచాయతీలకు విడుదల చేయాలి. పల్లెల్లో దిగజారిన పరిస్థితులు చక్కదిద్దేందుకు మళ్లించిన నిధులు, ఎగొట్టిన బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చెయ్యాలి.
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి