నాకు ఆ ఆలోచనే లేదు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మొదటి నుండి కూడా చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగు దేశం పార్టీ బాధ్యతలను, సీఎంగా పదవి బాధ్యతలను ఆయన తనయుడు లోకేష్‌ టేకోవర్‌ చేస్తాడు అనేది అందరికి తెలిసిన సత్యం. అయితే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కాని తాను ఎప్పుడు సీఎంను అవ్వాలని కోరుకోవడం లేదు అంటూ నారా లోకేష్‌ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. తాజాగా నారా లోకేష్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీఎం కావాలనే ఆలోచన తనకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

నాకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం తప్ప మరేం లేదని, అందుకు మంత్రి పదవి కూడా సరిపోతుందనేది తన అభిప్రాయం అని లోకేష్‌ చెప్పుకొచ్చాడు. నాకు భించిన మంత్రి పదవే ఎక్కువ. నేను అంతకు మించి ఏమీ ఆశించడం లేదని, ఉన్నత పదవులు చేపట్టాలనే కోరిక కూడా నాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. తెలుగు దేశం పార్టీపై గెలిచే సత్తా వైకాపాకు లేదు అని, ప్రజల సంపూర్ణ మద్దతు తెలుగు దేశం పార్టీకి ఉందని లోకేష్‌ పేర్కొన్నాడు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిసి సీఎంగా చంద్రబాబు నాయుడు మరోసారి పదవి బాధ్యతలు చేపట్టడం ఖాయం అని లోకేష్‌ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీకి ఎన్నిక కాకుండా మండలికి వెళ్లడంతో వస్తున్న విమర్శలను కూడా లోకేష్‌ తిప్పికొట్టాడు.