ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గాన్ని గత రెండు సంవత్సరాలుగా విస్తరిస్తాను అంటూ ఆశావాహులను ఊరిస్తూ వస్తున్నాడు. వైకాపా నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి వచ్చిన నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి పదవులు ఆశించిన వచ్చిన పలువురికి పదవులు కట్టబెట్టం అంత సులభమైన పని కాదు. అందుకే చంద్రబాబు నాయుడు ఆ పని చేసేందుకు ఆందోళన చెందుతున్నాడు. అయితే ఇప్పుడు తప్పని సరి పరిస్థితి వచ్చింది. తనయుడు లోకేష్ మరియు భూమ నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియలను కేబినెట్‌లోకి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాజకీయ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏప్రిల్ 2న కొత్త మంత్రులు కొలువుదీర బోతున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురికి ఉద్వాసన తప్పదని తేలిపోయింది. వారి పేర్లను అధికారికంగా అదే రోజు ప్రకటించే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 2న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మరియు అఖిల ప్రియలతోపాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఏప్రిల్ 2వ తేదీన గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను చంద్రబాబు నాయుడు కోరినట్లుగా తెలుస్తోంది. మంత్రి వర్గ విసర్తణ తర్వాత పార్టీలో విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందు నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.