Site icon TeluguMirchi.com

నంద్యాలలో పవన్‌ ఓటు ఎవరికి?

ఏపీలో త్వరలో నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికలను అధికార టీడీపీ మరియు ప్రతిపక్ష వైకాపాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఊరుకో నాయకుడు, మండలానికి ఒక మంత్రి అన్నట్లుగా నంద్యాలలో తెలుగు దేశం పార్టీ మోహరించింది. అధికారంను ఉపయోగించుకోవడంతో పాటు అన్ని విషయాలను తమకు అనుకూలంగా మరల్చుకుని గెలవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. తమ స్థానం అయిన నంద్యాలను మళ్లీ గెలుచుకోవాలని పట్టుదలతో పోరాటం చేస్తుంది వైకాపా. ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీ గెలుపు తద్యం. అయితే వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తాను అంటూ ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ ఈ ఎన్నికల్లో  మద్దతు ఎవరికి ఇస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా సందడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజల్లో ఆ పార్టీ ఒకటి ఉందనే గుర్తింపు ఉంటుంది. కాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎప్పుడో సభలు సమావేశాలు పెడుతున్నాడు. ఇలాంటి ఎన్నికల సమయంలో పవన్‌ పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపి, ఒకటి రెండు రోజులు ప్రచారం చేస్తే బాగుండేది అని ఆయన అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్‌ పోటీ అంటే కాస్త కష్టమే అని, ఇలాంటి ఉప ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని నంద్యాల ఉప ఎన్నికల విషయంలో పవన్‌ తటస్థంగా ఉండేలా కనిపిస్తున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీకి మరియు బీజేపీకి మద్దతు పలికిన పవన్‌ ఇప్పుడు ఆ పార్టీలకు కాస్త దూరంగా ఉంటున్నాడు.

Exit mobile version