సెక్షన్-8 ఎట్టి పరిస్థుతుల్లో అమలు చేయాల్సిందే అంటున్నారు ఏపి మంత్రులు. విభజన చట్టం లో ఉన్న సెక్షన్ నే అమలు చేయాలని కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రాద్దాంతం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టం అమలు అవుతున్నప్పుడు..కేవలం సెక్షన్ -8 అడ్డు కోవటం సరి కాదంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సెక్షన్-8 కు అడ్డుపడితే.. హైదరాబాద్ ను యుటి చేయాలని డిమాండ్ చేస్తామంటున్నారు..
కేంద్ర అటార్ని జనరల్..సెక్షన్8 అమలు పై గవర్నరకు సలహా ఇచ్చినట్లుగా..అది అమలు చేయాలంటూ సూచించినట్లుగా వస్తున్న వార్తల పై ఏపి మంత్రులు స్పందించారు. దీని పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుండటాన్ని ఏపి మంత్రులు తప్పు బట్టారు. విభజన చట్టం అమలు అయిన సమయంలో సంబరాలు చేసుకున్న వారు..ఇప్పుడు అందులోని ఒక సెక్షన్ అమలు కోసం ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని మంత్రి యన మల రామకృష్ణుడు ప్రశ్నించారు. దీని అమలు వ్యవహారం గవర్నర్ చూసుకోవాల్సి ఉంటుందన్నారు మంత్రి యనమల.
సెక్షన్-8 అమలు కోసం తాము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని..దీని పై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదంటున్నారు ఏపి డిప్యూటీ సీయం నిమ్మకాయల చినరాజప్ప. సెక్షన్-8 అమలు ద్వారానే హైదరాబాద్‌లోని ఏపి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. దీని అమలు భాద్యత కేంద్రం తీసుకుంటుందన్నారు చినరాజప్ప.
విభజన చట్టంలో ఉన్న సెక్షన్ నే తాము అమలు చేయమని కోరుతున్నామని..ఇది కొత్తగా సృష్టించింది కాదంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీని పై విభజన చట్టంలో స్పష్టం గా పేర్కొన్నారని..దీనిని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెక్షన్-8 అమలుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డు పడితే..తాము హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేస్తామన్నారు.
మొత్తానికి..అటార్ని జనరల్ సెక్షన్-8 అమలు పై గవర్నర్ కు సూచన చేసినట్లుగా వస్తున్న వార్తలు…కొత్త చర్చకు కారణమైంది.