Site icon TeluguMirchi.com

సైకిల్ ఎక్కి జంప్ అవుతున్న మాజీ మంత్రి

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆ హడావడి కనిపిస్తుంది. పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతుండగా.. పార్టీల్లోకి చేరికలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నేత కొండ్రు మురళీ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 31వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. అనుచరుల సమావేశoలో ఈ విషయాన్ని కొండ్రు మురళి ప్రకటించారు. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి బాధ కలిగించిందని, కష్టకాలంలో తనతో ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

2009 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున మురళీ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ సమయంలో డి.ఎల్ .రవీంధ్రా రెడ్డి భర్తరఫ్ కావటంతో ఆ స్ధానంలో మంత్రి గా పనిచేసే అవకాశం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వైధ్య, ఆరోగ్య శాఖా మంత్రిగా కొండ్రు మురళి పనిచేశారు. మురళీ మంత్రిగా ఉన్న సమయంలో రాజాం నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసుకున్నారు. రాజాంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయటంలో మురళీ తనదైన స్టైల్ లో ముందుకెళ్లారు.

ప్రస్తుతం రాజాం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ గా ఉన్న ప్రతిభాభారతి నాయకత్వాన్ని నాలుగు మండలాలకు చెందిన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిభా భారతికి ఆదినుంచీ రాజకీయ శత్రువుగా ఉన్న మురళీ టిడిపిలో చేరుతుండటం రాజకీయంగా చర్చకు దారితీసింది. అయితే కొండ్రును పార్టీలోకి చేర్చుకోవటాన్ని టీడీపీ సీనియర్ నాయకురాలు,మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తీవ్రంగా వ్యతిరేకించారు.

కొండ్రు చేరికతో సిక్కోలు రాజకీయాల్లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజాం నియోజకవర్గంపై మంచి పట్టున్న కిమిడి కళా వెంకట్రావుతో చర్చలు జరిపిన తర్వాతే కొండ్రు రాకకు టిడిపి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రరనసింహారెడ్డిలు కూడా టిడిపిలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

2014లో కాంగ్రెస్ నుంచి ఆయన బరిలోకి దిగగా, టీడీపీ నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పోటీ చేశారు. ఇద్దరు వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు శ్రీకాకుళంలోని రాజాం అసెంబ్లీ సీటును కొండ్రు మురళి ఆశిస్తున్నారు. మరి చంద్రబాబు గారు రాజాం అసెంబ్లీ సీటును ఎవరికీ ఇస్తారో చూడాలి.

Exit mobile version