హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన ఘటన ఇంకా కళ్ళముందు కదలాడుతూనే వుంది. ఇలాంటిదే ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుక్కల దాడులే కాదు.. గుట్టలు, శివారు పొలాల్లో ఉండే కోతులు గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం దొరక్కపోవడంతో గ్రామాల్లోకి చేరుకొని ఇళ్లలోకి చొరబడుతున్నాయి. వానరమూక దాడుల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు. పట్టపగలు ఇంటి తలుపు తెరిస్తే చాలు.. వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఇంట్లో నివశిస్తున్న చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడులకు కూడా దిగుతున్నాయి.
కాగా తాజాగా రెండు నెలల పసికందుపై కోతులు దాడి చేశాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగులగూడెంలో ఊయలలో పడుకోబెట్టిన పసికందుపై వానరమూక దాడి చేసింది. గుంపులు గుంపులుగా వచ్చిన కోతులు ఒక్కసారిగా ఊయలలో నిద్రిస్తున్న పాపపై దాడి చేశాయి. చిన్నారి కాలి బొటన వేలుని బలంగా కొరికాయి. దీంతో ఆ చిట్టితల్లి అల్లాడిపోతూ ఏడ్వగా.. ఏం జరిగిందోనని తల్లి పరుగు పరుగున ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కోతుల దాడి చేయటాన్ని చూసి ఆందోళనకు గురైన ఆమె.. కర్రతో వాటిని తరిమేశారు. అప్పటికే కోతులు చిన్నారి కాలిబొటన వేలును కొరికేశాయి. వెంటనే చిన్నారిని తల్లిదండ్రులు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పసికందు వేలికి ట్రీట్మెంట్ చేశామని.. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో తమ చిన్నారులను బయటకు పంపాలంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు.