కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ లోకి చేరబోతున్నారా ? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లో ఊహించిన రీతిలో ఆహ్వానం లభించలేదా ? తనకు రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పార్లమెంటుకు పోటీ చేసేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా ? ఈ నేపధ్యంలో మోహన్ బాబు తన మాతృసంస్థ అయిన తెలుగుదేశం పార్టీ లో మళ్లీ చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా ? ఇవి ప్రస్తుతం అటు రాజకీయ లాబీల్లోనూ, ఇటు సినిమా పరిశ్రమ వర్గాల్లోనూ వినిపిస్తున్న మాటలు.
గత కొద్ది కాలంగా జగన్ కు సన్నిహితంగా ఉంటూ వస్తున్న మోహన్ బాబు కొంత కాలం క్రితం జైలులో ఆయనను వ్యక్తిగతంగా కలిసివచ్చారు. బైటికివచ్చిన తరువాత జగన్ మంచివాడని, ఆయన త్వరలోనే నిర్దోషిగా బైటికొస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం తాను త్వరలోనే రాజకీయాలలోకి రానున్నానని కూడా ప్రకటించారు. తాను ఏ పార్టీ లో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఓ సస్పెన్స్ బులెటిన్ విడుదల చేశారు. మోహన్ బాబు వైఖరి గమనించిన వారందరూ ఆయన తప్పని సరిగా జగన్ పంచన చేరతారని భావించారు. తన కుమారుడు, సినిమా హీరో విష్ణు ద్వారా మోహన్ బాబు కు జగన్ తో సన్నిహిత బాంధవ్యం కూడా ఏర్పడింది. అయితే రాష్ట్రంలో ఏదో ఒక స్థానం నుంచి జగన్ పార్టీ ద్వారా పార్లమెంటుకు పోటి చేయాలన్నది మోహన్ బాబు ఆకాంక్ష గా తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని ఆయన జగన్ ముందు ఉంచారని, అయితే అందుకు జగన్ సానుకూలంగా స్పందించక పోవటం తో మోహన్ బాబు నిరాశ చెందారని తెలిసింది. దాంతో ఆయన తెలుగుదేశం చేరేందుకు యోచిస్తున్నట్టు భోగట్టా.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మోహన్ బాబు మంచి స్నేహితులు. ఇటీవలనే చంద్రబాబును తిరుపతిలోని తన కాలేజి కి ఆహ్వానించిన మోహన్ బాబు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి బాబు నాయకత్వం అవసరమని అన్నారు. ఇవన్నీ అవలోకనం చేసుకుంటే మోహన్ బాబు తెలుగుదేశం లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తను అంత తేలిగ్గా కొట్టి పారేయలేం కదా …..!