సుఖేష్ ఎవరో నాకు తెలియదు.. ఎమ్మెల్సీ కవిత


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని కవిత స్పష్టం చేశారు. ఫేక్ చాట్‌లతో తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ గారి జాతీయ స్థాయి కార్యచరణను రాజకీయంగా ఎదుర్కోలేక కొందురు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకులు పనిగట్టుకొని కొన్ని మీడియా ఛానెళ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సఖేష్ చంద్రకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వాస్తవాలను పట్టించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఆర్థిక నేరస్థుడు సుఖేష్ చంద్రను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తన ఫోన్ల విషయంలో కూడా తొందర పడి వార్తలు రాసి.. ఆ తర్వాత తొక ముడిచారని విమర్శించారు.