స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత నుంచి నియోజకవర్గంలో ఏదో విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న రాజయ్య రీసెంట్‌గా ఓ లేడీ సర్పంచ్‌పై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్ నాయకుడితో రాయబారం చేయడంపై ఆ మహిళా సర్పంచ్ తన గోడును స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ వార్త ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈవిషయంపై ఇప్పటికే జానకీపురం సర్పంచ్ ‘నవ్య’ మీడియా ముందుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు పెడుతున్న లైంగిక, మానసిక వేధింపులపై ఘాటు ఆరోపణలు చేశారు. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బుతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానంటూ ప్రలోభపెడుతున్నారని.. తనకే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది సర్పంచ్ నవ్య.
అయితే దీనిపై ఎమ్మెల్యే రాజయ్య కూడా స్పందించారు. ఎన్నికల సందర్భంలో తనను దెబ్బతీసేందుకు అనేక కుట్రలు పన్నుతారని చెప్పారు. అందులోభాగంగానే ఇప్పుడు కూడా దీన్ని హైలెట్ చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇక రాజయ్య ఇష్యూను ప్రతిపక్షాలు గట్టిగానే పట్టుకున్నాయి. రాష్ట్రంలోని మహిళలకు బీఆర్ఎస్ నేతల నుంచి రక్షణ లేకుండా పోయిందన్నారు. ముందుగా రాష్ట్రంలోని మహిళలపై వేధింపులు ఆగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు వివాదాలు కొత్త కాదు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడం కూడా పాత విషయమే. గతంలో ఓ మహిళా నాయకురాలిపై చేయి వేసినట్లు, కేక్ తినిపించినట్లుగా వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో కొంటె ఎమ్మెల్యేగా చిత్రీకరించబడ్డారు. తాజా వివాదం మరి ఈయన్ను ఎంతలా డ్యామేజ్ చేస్తుందో తెలియాలి అంటే వేచిచూడాలి.