లాక్‌డౌన్‌ ని ఉల్లఘించిన వైసీపీ ఎమ్మెల్యే


దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ చిత్తూరు జిల్లా కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్‌ బాధ్యతా రహితంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలోని ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

బెంగళూరు నుంచి ఐదు కార్లలో ఏపీ సరిహద్దుల్లోకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్… తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులను కోరారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వాహనాల్లో 39 మంది బంధువులు కూడా ఉన్నారు. అయితే వీరిని చీకలబైలు చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ వాగ్వాదానికి దిగారు.

లాక్‌డౌన్‌ దృష్ట్యా రాష్ట్రంలోని అనుమతించేది లేదని చిత్తూరు పోలీసులు తేల్చి చెప్పారు. వారందరినీ చెక్‌పోస్టు నుంచి వెనక్కి పంపారు. పోలీసులతో కొద్ది సేపు వాదించిన ఎమ్మెల్యే.. తర్వాత మదనపల్లివైపు వెళ్లిపోయారు.