నవమాసాలు మోసి బిడ్డను కంటే ఆ శిశువు అపహరణకు గురయ్యింది. ఏం చేయాలో అర్ధంకాక దేవునిమీద భారం వేశారు తల్లిదండ్రులు. బిడ్డ తిరిగి తమ వద్దకు చేరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం సీఎంఓలో కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. జన్మజన్మలకూ రుణపడి ఉంటామని ముఖ్యమంత్రితో అన్నారు. ఈ నెల 14న విజయవాడ ప్రభుత్వ పాత ఆస్పత్రిలో లావణ్యకు జన్మించిన ఆరు రోజులు శిశువును ఇంక్యుబేటర్ లో ఉంచారు. తెల్లవారి నిద్రలేవగానే చూసుకుంటే బిడడ్డ మాయం కావటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రష్యాపర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం తెలిసి తక్షణం స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు 11 బృందాలు రంగంలోకి దిగి శిశువు కోసం గాలింపుచర్యలు చేపట్టిన విషయం విదితమే. మంత్రి కామినేని శ్రీనివాస్ ద్వారా వారు ముఖ్యమంత్రిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శిశువును ఎత్తుకుని ఆశీస్సులు అందజేశారు. ఆ బిడ్డపేరున పాతికవేలు ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.