గాడి తప్పిన పాలన….!

ap-Secretariatవిభజన ప్రకటన తరువాత రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. సమైక్య ఉద్యమంతో సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో పనులకు రావడం మానేయగా… కేంద్ర ప్రభుత్వం ప్రకటన తరువాత సీఎం కూడా పాలన విషయంలో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. సీమాంధ్ర ఉద్యమంతో మొన్నటి వరకుఅక్కడ ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతబడ్డాయి. సంక్షేమ ఫలాలు ప్రజలు అందించాల్సిన ప్రభుత్వం వాటి ఊసే మరిచిపోయింది. అంతేకాదు రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందన్న సంతోషంలో ఒకవైపు తెలంగాణ మంత్రులు సంబరాలు జరుపుకుంటూ….మరోవైపు సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలంటూ సీమాంధ్ర మంత్రులు సచివాలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇటు ఉద్యోగులు అటు రాజకీయ నాయకులు రాష్ట్ర సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో పాలన గాడితప్పిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఎంతో ఆడంబరంగా మొదలు పెట్టిన పంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా ఇంకా వెల్లడించలేదు. విభజన నేపథ్యంలో వాయిదా పడిన టెట్ మళ్లీ ఎప్పుడ జరుగుతుందో తెలియదు. అప్పుడెప్పుడో నిర్వహించిన ఎస్ఐ ఫలితాలు ఇంకా వెల్లడించలేదు. ఇటు సంక్షేమ పథకాలు అమలు కాక, అటు ఉద్యోగాల నియామకాలు లేక రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సచివాలయంలో ఫైల్లు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. ఇప్పుడిప్పుడే ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా రాష్ట్ర సంక్షేమం వైపు దృష్టిసారించడం మంచిది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు సీఎం ఇదివరకు చేపట్టిన రచ్చబండ కార్యక్రమం కూడా మళ్లీ ఇప్పటివరకు నిర్వహించలేదు. అప్పటి హామీలే నెరవేర్చిన దాఖలాలు కనిపించడంలేదు. మరి ఇకనైనా మన పాలకులు రాష్ట్ర పాలనవైపు దృష్టి సారిస్తే మంచిదని ఎంతో మంది కోరుకుంటున్నారు. అయినా గాడితప్పిన ఈ పాలన గాడిలో పడాలన్నా, ఉన్న ఫైల్ల బూజు దులపాలన్నా ఇంకా చాలా టైం పట్టేట్టు కనిపిస్తోంది…..