ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారు అంటూ జగన్ ప్రకటించిన నేపథ్యంలో వారికంటే ఒక్క రోజు ముందే తెలుగు దేశం ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు అంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలపై ఏకీభవించారు. అయితే తాజాగా మరోసారి మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తెలుగు దేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు అంటూ తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని, దానికి పార్టీతో సంబంధం లేదని, తనకు అనిపించినట్లుగా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను తప్ప, పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఎంపీలతో చర్చించి ఆ మాట చెప్పలేదు అంటూ ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చాడు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, అందుకే తన అభిప్రాయంగా ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పాను అని, పార్టీ నాయకత్వంకు తన వ్యాఖ్యలకు సంబంధం లేదు అంటూ మంత్రి చెప్పుకొచ్చాడు. రాజీనామా వ్యాఖ్యలు చేసిన గంటలోనే మంత్రి ఇలా మాట మార్చడంతో అంతా కూడా షాక్ అవుతున్నారు.