మంత్రి మల్లారెడ్డి వైఖరిపై మేడ్చల్ జిల్లాకు చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి వాపోయారు. మైనంపల్లి నివాసంలో వీరు సమావేశమై చర్చించారు. మల్లారెడ్డి అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
మల్లారెడ్డి కారణంగా జిల్లాలోని పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ విషయం కేటీఆర్ వరకు వెళ్లిందని, రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ అనే వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించాడని మైనంపల్లి ఆరోపించారు. ఇప్పటి వరకూ కుత్బుల్లాపూర్‌కి చెందిన రవి యాదవ్‌ను తప్పించి మేడ్చల్‌కు చెందిన భాస్కర్ యాదవ్‌ను నియమించడంతో వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి అవకాశం ఇచ్చిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ పదవులు కట్టబెడుతున్నారని.. మరి తమ అనుచరులు పరస్థితి ఏమిటని మైనంపల్లి ప్రశ్నించారు. ఒకే వ్యక్తి ఎనిమిదేళ్ళు ఒక పదవిలో ఎలా కొనసాగనిస్తారనిమైనంపల్లి ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ అనుచరుల పరిస్థితి ఏమిటి అన్నారు. ఎన్నికలు రానున్నాయని అలాంటి సమయంలో తమ అనుచరులు వెనక్కి తగ్గితే తమ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.