మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఎవరు?


మెడికల్ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకింది. గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఆరు రోజుల క్రితం ప్రీతి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. అనంతరం ఆమెను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఐదురోజుల పాటు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. కాగా ఆమె ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి సైఫ్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమె మృతికి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని, ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తమ కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే కాలేజీలో సైఫ్ అనే సీనియర్ విద్యార్థి తనను వేధిస్తున్నట్లు ప్రీతి హెచ్‌వోడీకి, ప్రిన్సిపల్‌కు కంప్లైంట్ చేసింది. అయితే అతనిని హెచ్చరించారు కానీ చర్యలు తీసుకోలేదు. దీనికితోడు సీనియర్ విద్యార్థిని అందరూ వెనకేసుకురావడంతో.. తనను ఒంటరి దాన్ని చేసారని బాధపడింది. అంతేకాదు పేషెంట్ కేస్ షీటు సరిగా రాయడం లేదని సైఫ్ వాట్సాప్‌లో షేర్ చేయడంతో అందరిలో చదువురాదని హేళన చేస్తున్నట్లు భావించి అందరిలో తాను చులకన అయ్యానని భావించింది. సున్నిత మనసత్వం కలిగిన ప్రీతి చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులపై సరైన చర్యలు చేపట్టకపోవడం ఆమె ఆత్మహత్యకు కారణమని చెప్పవచ్చు. యాంటీ ర్యాగింగ్ గ్రూప్‌లు వంటి ఏర్పాటు చేసినా అవి బోర్డులకే పరిమితమవుతున్నాయి. వేధింపులపై కంప్లైంట్ చేసినా హెచ్‌వోడీ, ప్రిన్సిపల్ చర్యలు తీసుకోకవడం.. పైగా అతన్నే వెనుకేసుకురావడం.. ఎవరిది తప్పు? వ్యవస్థలదా? లేక వారిని ఎంకరైజ్ చేస్తున్న తోటి విద్యార్థులదా? ఎవరిని నిందించాలి? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? ఇంకెంతమంది బలి కావాలి ? ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వేధింపులు, ర్యాగింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా అరికట్టవచ్చు.